మంత్రి సత్యకుమార్ చొరవ.. యువకుడికి గుండె మార్పిడితో కొత్త జీవితం

ఏపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చూపిన చొరవ ఓ యువకుడికి ప్రాణం పోసింది. తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతున్న యువకుడికి మంత్రి సహాయంతో గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన చరణ్ కుమార్ అనే యువకుడు మూడు వారాల క్రితం గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేరాడు. అతడికి గుండె మార్పిడి తప్పనిసరి అని వైద్యులు స్ప‌ష్టం చేశారు. దీంతో చరణ్ తల్లిదండ్రులు మంత్రి సత్యకుమార్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

వెంటనే స్పందించిన మంత్రి సత్యకుమార్, బెంగళూరులోని దేహీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ వైద్యులతో మాట్లాడారు. చరణ్‌ను ఆ ఆసుప‌త్రికి తరలించగా, డాక్టర్ దుర్గాప్రసాద్ బృందం ఈ నెల 21న గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. బ్రెయిన్ డెడ్ అయిన 27 ఏళ్ల యువకుడి గుండెను దాతల అంగీకారంతో చరణ్‌కు అమర్చారు. ప్రస్తుతం చరణ్ కోలుకుంటున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. తమ కుమారుడికి ప్రాణదానం చేసిన మంత్రికి, వైద్యులకు చరణ్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో రూ.25 లక్షల ఆరోగ్య బీమా
మరోవైపు రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని హైబ్రిడ్ విధానంలో అమలు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఈ పథకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, దీని ద్వారా రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుందని, ఏడాదికి రూ.2.50 లక్షల వరకు వాడుకోవచ్చని వివరించారు.

తూర్పుగోదావరి మరణాలపై స్పందన
తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలపై మంత్రి స్పందించారు. పాలు, ఇతర పదార్థాల కల్తీ కారణంగానే ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. నిజానిజాలు తేల్చేందుకు శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించామని, రిపోర్టులు వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు.

Satya Kumar Yadav
AP Health Minister
Heart Transplant
Charan Kumar
Andhra Pradesh
Universal Health Insurance
East Godavari Deaths
Organ Donation
Healthcare AP
Hybrid Insurance Policy

More Telugu News